మోడల్ స్కూల్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి: నాగసముద్రాల సంతోష్
రహీంఖాన్ పేట గ్రామంలోని మోడల్ స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులు సరియైన రవాణా, రోడ్డు సౌకర్యాలు లేక నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్ అన్నారు. విద్యార్థులు ప్రతిరోజు ఆటోల ద్వారా పాఠశాలకు వెళ్తుండగా, మెయిన్ రోడ్డునుంచి పాఠశాల వరకు 1.5 కి.మీ మేర మట్టిరోడ్డు ఉన్నప్పటికీ అడుగ డుగునా గోతులు, పలు చోట్ల భూమి నెరలు ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్ష కాలం వచ్చిందా ఇక విద్యార్థుల అవస్థలు చెప్పడానికి వీలులేకుండా ఉండగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం తల్లిదండ్రులలో నెలకొందన్నారు. పాఠశాలను నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న నేటికి రోడ్డు నిర్మాణం మాత్రం ప్రతిపాదనలకే పరిమితమయిందన్నారు. ఇట్టి విషయమై పలుమార్లు అధికారుల, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా నామమాత్రపు హామీలతో సరిపెడుతున్నారన్నారు. ఇప్పటికైనా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు చొరవ తీసుకోని పాఠశాలకు రోడ్డు నిర్మాణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నామన్నారు.