ఘనంగా బీరప్ప జాతర ముగింపు ఉత్సవాలు
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
ఇల్లంతకుంట మండలకేంద్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న బీరప్ప కామరాతి జాతర ఉత్సవాలు శుక్రవారం గారడి విద్య, రతి పోయడంతో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు స్థానిక ఎంపిటిసి వొగ్గు నర్సయ్య మాట్లాడుతూ గొల్ల, కుర్మల ఆరాధ్య దైవం అయిన బీరప్ప స్వామి కామరాతి ఉత్సవాలు ఆదివారం బీర్ల పూజరులు గుడిపై పాలు, నెయ్యి పోయడంతో మొదలై గురువారం పోచమ్మ బోనాలు, శుక్రవారం రఘు బోనం, శనివారం వీరగంధాలు, ఆదివారం బియ్యం సుంకు, లగ్గం బోనాలు, సోమవారం లగ్గం పట్నం, గొర్లు కోయుట, మంగళవారం నాగవెల్లి బోనాలు, బీరప్ప కథ, బుధవారం నాగవెల్లి పట్నం, అక్క మహంకాళి, బీరప్ప, కామరాతి వేషాలు, గురువారం ఎట్టి ముల్లెలు, గారడి వేషం, శుక్రవారం రతి పోయడంతో బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిసాయని తెలిపారు. అలాగే ఉత్సవాల సమయంలో కుల సంఘ సభ్యులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కుర్మ సంఘం సభ్యులు మ్యాకల ఐలయ్య గత నెల రోజుల నుంచి బీరప్ప జాతర ఉత్సవాలు గురించి అనునిత్యం శ్రమించి విజయవంతం చేసిన స్థానిక ఎంపిటిసి కమిటీ అధ్యక్షులు వొగ్గు నర్సయ్య ను, పెద్ద కుర్మ ఎగుర్ల భూమలింగంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గొల్ల, కుర్మ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.