గొల్లకుర్మలు ఆత్మగౌరవంగా బ్రతకాలి
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని జవారిపేట గ్రామంలో గొల్లకుర్మలకు 17 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో గొల్లకుర్మలు ఏ సాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక గొల్లకుర్మలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంగా బ్రతకాలనే సంకల్పంతో సబ్సిడీపై గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం పొద్దుగాలనే జవారిపేట గ్రామంలోని ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు ₹10వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. రైతుభీమా ద్వారా రైతు ఏదైనా కారణంతో మరణిస్తే ₹5లక్షలు భీమా అందించి కుటుంబానికి ప్రభుత్వం ధీమా కల్పిస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎళ్ల కాలంగా ఉన్న బీడుభూములకు సాగు నీరందించి పచ్చటి మాగానులుగా మార్చడం జరిగిందన్నారు.
వేసవికాలం కావడంతో మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు త్రాగునీటి సమస్య ఏ ఒక్క కాలనీలో కూడా ఉండొద్దని, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో పూర్తి స్థాయిలో సందర్షించి మంచినీటి సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు.దళితబంధు పథకం ద్వారా ₹10 లక్షలు అందించి దళితుల బ్రతుకుల్లో వెలుగులు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంగా బ్రతకాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఇల్లులేని నిరుపేదలకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించడం జరుగుతుందని త్వరలోనే ప్రభుత్వం ఇంటి స్థలం ఉన్న వారికి కూడా ₹3 లక్షలు సాయం అందిస్తామన్నారు.
జడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ వెంకటరమణ రెడ్డి, ఏడి పశుసంవర్ధక శాఖ కొమురయ్య, సింగిల్ విండో చైర్మన్ అనంతరెడ్డి, ఎంపీడీఓ రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సర్పంచ్ లు వాణి, పద్మ, శ్రీలత, భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు శ్యామల, వనజ, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.