రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
-ఢిల్లీ టీఆర్ఎస్ నిరసన దీక్షలో కేంద్రం తీరుపై ఆగ్రహం
-వడ్లు కొనేదాకా ఆగేది లేదు...పోరాటం తగ్గేదెలే
-కేంద్రం తీరు దున్నపోతు మీద వానపడ్డట్లు ఉందని ధ్వజం
-వడ్లు కొనేదాకా రైతుల పక్షాన పోరాడుతాం
-రైతుల నోట్లో మట్టికొట్టాలని చూస్తే మరో మిలియన్ మార్చ్ తప్పదు
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
తెలంగాణ లోని నెర్రెలుబారిన నేలను సాగునీటితో పచ్చటి మాగానులుగా చేసేందుకు సీఎం కేసీఆర్ శ్రమిస్తుంటే ఓర్వలేని బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. ఢిల్లీ లో సోమవారం టీఆర్ఎస్ తలపెట్టిన నిరసనదీక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున్నరేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ అసాధ్యమనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సుసాధ్యం చేశారని, ఏళ్ల కాలంగా బీడువారిన భూములకు సాగు నీళ్లు తీసుకొచ్చి రైతుల కన్నీళ్లు తుడిచారని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో తమకిక నూకలు చెల్లాయని గ్రహించి రాష్ట్ర బీజేపీ నాయకులు, కేంద్రంతో తెలంగాణ రైతాంగాన్ని ముప్పుతిప్పలు పెట్టిస్తున్నారని అన్నారు. యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు టీఆర్ఎస్ పోరాటం ఆగబోదన్నారు...నాడు రాష్ట్రం కోసం 14 ఏళ్ళు ఉద్యమాలు చేశామని... నేడు రైతుల కోసం ఉద్యమం చేస్తున్నామన్నారు. పంజాబ్ రాష్ట్రంలో కేంద్రం ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని, తెలంగాణ రైతులు ఏం అన్యాయం చేశారని కొనడం లేదని దుయ్యబట్టారు. యాసంగి ధాన్యం కొనేంత వరకు కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమ సెగ తప్పదని హెచ్చరించారు. రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, కేంద్రం ధాన్యం కొనకుంటే ఇండియా గేట్ దగ్గర ధాన్యం పోస్తామని అన్నారు. తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేయాలని చూస్తే పుట్టగతులుండవని, రైతును కన్నీరు పెట్టిస్తే కేంద్ర ప్రభుత్వ వినాశనం ఖాయమని అన్నారు.యాసంగి వడ్లు కొనకుంటే మరో మిలియన్ మార్చ్ తప్పదని పేర్కొన్నారు.
కేంద్రం తీరు చూస్తుంటే దున్నపోతుపై వానపడ్డ మాదిరిగా ఉందని ఎమ్మెల్యే రసమయి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ రైతులకు ఒక న్యాయం, తెలంగాణ రైతులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో ధాన్యం గింజ లేకుండా కొంటున్నారని, తెలంగాణ రైతులు కేంద్రానికి ఏం అన్యాయం చేశారో మోడీ సర్కారు చెప్పాలని అన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యాసంగి ధాన్యాన్ని కొంటామని రైతులు వరినాట్లు వేయక ముందు ప్రకటనలు చేసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనాలని మాట్లాడుతున్నారని బండి సంజయ్ గల్లీలో ఒక మాట...ఢిల్లీలో ఒక మాట్లాడుతున్నాడని, బండి సంజయ్ కు దమ్ముంటే కేంద్రంతో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనేలా ప్రకటన చేయించాలని అన్నారు. రైతులని తప్పుదారి పట్టించేలా బండి సంజయ్ మాట్లాడొద్దని పేర్కొన్నారు.
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆగేదే లేదని...కేంద్రంపై పోరాటం తగ్గేదెలే అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సర్కారు పని చేస్తుందని, వడ్లు కొనేదాకా కేంద్రంపై యుద్ధం ఆగబోదన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని, వడ్లు కొనేదాకా కొట్లాడుదామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ని చూసి ఓర్వలేని మోడీ సర్కారు రైతులను కావాలని ఇబ్బందులు పెడుతోందని, తెలంగాణ రైతులు తలచుకుంటే పంజాబ్ రైతుల తరహాలోనే కేంద్రంపై పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నారని, యాసంగి ధాన్యం కొనకుంటే కేంద్రానికి రైతు ఉద్యమ సెగ తప్పదన్నారు.