27జూలై, ఇల్లంతకుంట :
జిల్లా ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్), కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలము గాలిపల్లి గ్రామములోని రైతువేదిక నందు "వ్యవసాయంలో సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం, పోర్టల్స్ మరియు మొబైల్ అనువర్తనాల ఉపయోగం" మీద రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరితగతిన అందిపుచ్చుకోవడానికి ఈ వ్యవసాయ సమాచార ప్రసార సాంకేతిక సాధనాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అని తెలిపారు. అలాగే రైతులకు వివిధ చరవాణి అనువర్తనాలను (మొబైల్ అప్లికేషన్స్) రైతులకు వివరించడమే కాకుండా రైతుల ఫోన్లలో ఇన్స్టాల్ చేసి ఎలా ఉపయోగించాలో డెమో ద్వారా చూపించారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ద్వారా ప్రచురించబడుతున్న పి.జె.టి.ఎస్.ఎ.యు. యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులు తమకు కావాల్సిన ఆధునాతన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. అదే విధంగా రైతులు కిసాన్ సారథి టోల్ ఫ్రీ నెంబర్ అయిన 14426 లేదా 1800 123 2175 కు కాల్ చేసి నేరుగా శాస్త్రవేత్తలతో తమ పంతలలోని సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే అధిక వర్షాలు కురిసిన తరువాత పంటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివారించారు. ప్రస్తుతం ప్రత్తి పంటలో నిలిచి ఉన్న నీటిని బయటకు కాలువల ద్వారా తీసివేసి, వడలు తెగులు గమనించినట్లయితే 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు తడిచే విధంగా పిచికారి చేయాలి. తరువాత 19:19:19 లేదా 13-0-45 అనే పోషకాన్ని లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికారి చేయాలి. తదనంతరం డాట్ సెంటర్ శాస్త్రవేత్త డా. ఎమ్. రాజేంద్రప్రసాద్, ప్రస్తుతం పంటల్లో వచ్చే చీడ పీడల యాజమాన్యం గురించి వివరించారు. ముఖ్యంగా ప్రత్తిలో వచ్చే రసం పీల్చే పురుగుల నివారణకు వేప కషాయం 5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోరొప్రిడ్ 0.3 మి.లీ. మందుని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. ప్రస్తుతం మొక్కజొన్న లో వస్తున్న కత్తెర పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రాముల మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.తదనంతరం పత్తి, వరి పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీమతి. జ్యోతి, ఎంపీటీసీ - శ్రీమతి. శ్యామల దేవి, గ్రామ సర్పంచ్ - శ్రీమతి. వాని దేవేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.